పొద్దున్నే పేపర్ తెరవాలంటేనే భయపడే రోజులొచ్చాయి.కెసియార్ ఎవర్ని బూతులు తిడతాడో,ఏ తిండి పదార్ధాన్ని పేడ-పెంట అంటాడో?జగన్ ఎవరికి శాపనార్ధాలు పెడతాడో,ఎవర్ని వోదారుస్తాడో?,చంద్రబాబు ఎవరి గుండెల్లో నిద్రపోతాడో,ఎవర్ని అవినీతిపరుడంటాడో ?,కికురె,రాశేరె హయాంలో జరిగిన హత్యలు,స్కాములనుంచి ఎవర్ని రక్షించానంటాడో?,చిరంజీవి సామాజిక న్యాయం గురించి మనకు తెలియనివెన్ని చెబుతాడో ?,ఏ జాక్ వాళ్ళు ఎప్పుడు బందంటారో?చర్లపల్లి ఖైదీలెవర్ని తంతారో?ఏ భగ్న ప్రేమికుడెవరి గొంతు కోసాడో?నని హడలిచచ్చే రోజులు.
ఇంకా చిత్ర విచిత్ర వార్తలు.దేశ రక్షణమంత్రి,సోనియా దూతగా చిరంజీవి ఇంటికెళ్ళి కాంగ్రెస్ను రక్షించమని వేడుకోవడం!కాల్మొక్కుతా,భాంచను దొరా అనే కాకాకు,అకస్మాత్తుగా సోనియా విదేశీ వనిత అని గుర్తుకు రావడం!ప్రత్యేక తెలంగాణా ఇస్తావా,పదవి దిగుతావా అని హూంకరించడం!రాజకీయనాయకులు ఒకళ్ళనొకళ్ళు కలసగూడదా?అని కికురె మీడియా వాళ్ళను గద్దించడం!కాంగ్రెస్,జగన్ వర్గం ఒకళ్ళమీదొకళ్ళు బస్తీమే సవాల్ అని జబ్బలు చరవడం!జగన్ వర్గం,కాంగ్రెస్ కూ తెదేపా కు మ్యాచ్ ఫిక్సింగ్ అని అరోపించడం!పావలా వడ్డీ పధకం మా ఐడియా అని ఒకరంటే,చిరంజీవిని కాంగ్రెస్లో కలుపుకొమ్మని రాశేరె మేడమ్మ కప్పుడే ఉత్తరం రాశాడని ఇంకొకరు.అంతా అయోమయం గందరగోళం.హాల్లో కార్ల్ మార్క్స్ ఫోటో పెట్టుకొని,మాతాత ఫొటో అని మురిపెంగా చెప్పుకొనే నా మార్క్సిస్ట్ స్నేహితుడు చలసాని శిశిర్ తో నాసందేహనివృత్తి చేసుకొందామని,తన మార్క్సిస్ట్ విస్లేషణలతో నాబాధకు కొంతైనా ఉపశమనం కలుగుతుందని ఆయన ఇంటిదారి పట్టాను.ఏకరువు పెట్టిన నా బాధలన్నీ శ్రధ్ధగా విని,కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో,దాస్ కాపిటల్ నుంచి విస్తృతంగా కోట్ చేస్తూ పై పరిణామాలకు విశ్లేషణలిచ్చాడు తన కమ్యూనిస్ట్ పరిభాషలో .నాకొక్క ముక్క అర్థమైతే ఒట్టు.నా బుర్రలో సమస్యలింకా జటిలమై అచ్చు ఆంధ్రప్రదేష్ పరిస్థితిలా గందరగోళమయ్యింది .గతమెంతో ఘన కీర్తిగల తెలుగువాడిగా చెయ్యెత్తి ఎవరికి జై కొట్టాలో అర్థం కావటల్లేదన్నా నా మిత్రుడితో.అర్థం కాకపోవడంలో నీతప్పు లేదు,మా కమ్యూనిస్ట్లు చెప్పేవి ఒక్కొక్కసారి వాళ్ళకే అర్థం కావు.ఐదుగురు నాయకుల పంచతంత్ర కధ చెబుతా,చిరంజీవి స్టైలులో నీకు బాగా స్పష్టత వస్తుంది,ఆ విధంగా ముందుకు పోదామన్నాడు శిశిర్.
సోనియా,చంద్రబాబు,చిరంజీవి,కెసియార్,జగన్ క్లబ్ లో సిండికేటు ఆట ఆడుతున్నారు.పేకలో ఒకటే జోకర్ ఉంది.అందరూ తప్పనిసరిగా(కంపల్సరీ)ఆడ వలసిన స్టేజిలో ఉంది ఆట.1)సోనియా2)చిరంజీవి3)జగన్4)చంద్రబాబు5)కెసియార్,ఈక్రమంలో కూర్చొన్నారు ఆటగాళ్ళు.క్లబ్లో కార్డ్లు పంచేవాడు వీరప్పమొయిలీ.ఒక్కొక్కరికీ 13 కార్డ్లు పంచాదు మొయిలీ.
ఒకే ఒక్క కార్డుతో షో చేసేటట్లు మ్యానేజ్ చేయమని మొయిలీతో ముందుగానే మాట్లాడుకొన్న సోనియా చిద్విలాసంగా కార్డులు ఎత్తుకొంది.
1)సోనియా:-డీల్ షో వేయవల్సిన ఆట ఇలా వేసి చచ్చాడేంటి వీడు?ఇందులో ఏదో కుట్ర వుంది.రేండు ట్రిప్లెట్లు,మిగతావన్నీ మంచి పెయిర్లు.సరే అయిందేదో అయింది.జాగ్రత్తగా ఆడితే గెలిచే ఛాన్సుంది.జగన్ ను చంద్రబాబును గెలవనీయకుండా జాగ్రత్త పడితే చాలు.కెసియార్,చిరంజీవిలవి నా డమ్మీ హాండ్లేగదా!
2)చిరంజీవి:-4 కార్డ్ ల ట్రిప్లెట్,రెండు సీక్వెన్స్ పెయిర్లు,మిగతావన్నీ వేస్ట్ కార్డ్ లయినా ఆట మంచాటే.ఆమె కొట్టే కార్డుతోనే బ్రతకాలి.అయినా మా ఇద్దరి ఒడంబడిక ప్రకారం ,సోనియా షోతిప్పితే నాకు వాటానిస్తానందిగాబట్టి నాకేం ఢోకా లేదు.ఆట బ్రహ్మాండంగా ఆడొచ్చు.
3)jagan:-నాలుగు కార్డుల సీక్వెన్స్,రెండు ట్రిప్లెట్ పెయిర్లు,రెండు సీక్వెన్స్ పెయిర్లు.పేకలోంచి మంచికార్డులొస్తాయి.ఆట తిప్పేది నేనే.సోనియాకు నాకు మధ్యలో ఈ చిరంజీవొకడు కూర్చున్నాడు గాని లేకపోతే నాకు కావాల్సిన కార్డులన్నీ ఆమె చేతిలోనే ఉన్నాయి.చిరంజీవి అడ్డం లేకపోతే మూడు రౌండ్లలోనే నేను షో చేసేవాడిని.ఏదోఒకటి చేసి సోనియాను మాత్రం షో చెయ్యనివ్వను.
4)chandrababu:-నాలుగు కార్డుల సీక్వెన్స్,రెండు ట్రిప్లెట్లు,ఒక అప్ డౌన్ పెయిర్.ఏసి,డీసి.ఒకే ఒక కార్డుతో షో ఉంది కాని అది రాలేదో ఫుల్ కౌంట్.ఇంకో ఆట ఆడటానికి డబ్బులుగూడా లేవు.టేబుల్ లో ఉన్న మిగతా నలుగురూ నాకు శత్రువులే.ఎప్పుడు ఎవరు ఏకమౌతారో?వాళ్ళ మధ్య లోపాయకారీ ఒప్పందాలేమిటో?ఆలోచిస్తే బుర్ర ఖరాబ్.చాలా జాగర్తగా ఆడాలి.మిగతావాళ్ళానందరినీ ఒక కంట కనిపెట్టాలి.
5)కెసియార్:-ఆటలో ఉన్న ఒక్క జోకర్ నాకే వచ్చింది.మిగతా 12 కార్డులూ ఒకదానికొకటి సంబంధం లేని వేస్ట్ కార్డులే.నా ఆట ఎట్టిపరిస్థుతలలోనూ షో అవదు.అయితేమాత్రం నాదేం ఊడింది.నా ఆటకు పైసలు కట్టింది సోనియానే గదా.కాంగ్రెస్,జగన్ లలో ఎవరు షో తిప్పినా బేరం కుదుర్చుకొని తృణమో,ఫణమో గిట్టించుకోవచ్చు.చంద్రబాబుదొక్కడిదీ షో అవకుండా ఉంటే చాలు.
ఆట నీకర్థమయింది గదా అని అడిగాడు శిశిర్.కధ చెప్పినవాడివి విశ్లేషణ గూడా చెప్పమన్నా.జోకర్,సీక్వెన్స్,ట్రిప్లేట్లతో సోనియా కు ఆట పంచాల్సిన మొయిలీ తన అసమర్థతో ఆ రిగ్గింగ్ పని చేయలేకపోయాడు.సోనియా కొట్టే కార్డులు చిరంజీవికి పనికిరావు,వాటితోనే జగన్ కు షో అయినా చిరంజీవి మధ్యలో ఉండటం మూలాన ఎత్తలేడు.జగన్ అనాలోచితంగా కొట్టే కార్డులతో చంద్రబాబుకు షోతిరిగే ఆస్కారం ఉంది.చంద్రబాబు కొట్టే కార్డులు,కెసియార్ ఎత్తినా ,బాబును భయపెట్టడానికేకానీ షో తిప్పడానికి పనికిరావు.కెసియార్ దగ్గరున్న తెలంగాణా అనే జోకర్,సీక్వెన్స్,ట్రిప్లెట్ ల సపోర్ట్ ఉంటే పనికివస్తుందుగానీ అవి లేకుండా నిరర్థకం.కెసియార్ జోకర్ కొడితే సోనియాకు షో అవుతుంది కాని ఆట నియమాలందుకు ఒప్పుకోవు.మరి రాఘవులు,నారాయణ సంగతేంటి అని అడిగాను.ఇద్దరూ గోదావరి ఒడ్డు మీద నించొన్నారు,ఆటలో ఎవరుగెలిస్తే వాళ్ళ తోక పట్టుకొని ఈదుదామని,అన్నాడు శిశిర్.
ఇప్పుడర్థమయిందిగదా మన నేతల సమస్యలు అన్నాడు శిశిర్.అర్థమయ్యింది గాని నా బుర్ర తిరుగుతోంది నేనిక వస్తానని ఇంటిదారి పట్టా.