అల నాటి దీపావళి-ఆ మధుర జ్ఞాపకాలు

దీపావళి పండుగకు నెల రోజుల ముందునుంచే మొదలయ్యే రోలు రోకళ్ళ సందడి,పిస్తోలు మరియు పిస్తోలు బిళ్ళలు,ఎండు తాటి గిలకల బొగ్గుల నుంచి తయారు చేసే పూల పొట్లాలు,వాటిని గిర గిరా తిప్పుతుంటే పడే నిప్పు రవ్వల విష్ణుచక్రం.ఇంట్లో తయారు చేసిన తాటాకు టపాకాయలు,మతాబులు,కుమ్మరినుంచి తెచిన మట్టి ముంతలతో చేసిన చిచ్చు బుడ్లు.కొబ్బరి ఈనెల తారాజువ్వలు,పచ్చి తాటి మట్టల మధ్య పెట్టిన ఉమ్మెత్త దీపాల గుమ్మటాలు. అమ్మ చేతి పిండి వంటలు , నాన్న చెప్పే నీతి కధలు. ఇదేనండీ మా చిన్ననాటి దీపావళి పండుగ. కాలుష్యం, కల్మషం లేని నా చిన్ననాటి దీపావళి స్పూర్తితో తెలిపే శుభాకాంక్షలు.

మంత్రులా? బందిపోటుదొంగలా?

దేవునిమీద ప్రమాణం చేసి భారతరాజ్యాంగానికి విధేయుడనై ఉంటానని,బధ్థుడనై ఉంటానని మంత్రిగా ప్రమాణం చేసిన మోపిదేవి,తన రాజీనామా పత్రంలో మాత్రం నాయకుడిని మరియు పార్టీని నమ్ముతూ నాటి ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు సంతకం పెట్టానని వ్రాశారు.ఈయన విధేయత రాజ్యాంగానికా,ఆనాటి ముఖ్యమంత్రికా?

రాజీనామా పత్రంలో ఇంకా ఏమని వ్రాశారో చూడండి."ఫైల్స్ నా కార్యాలమునకు రాకున్నను,వారి కార్యాలమునకు పిలిపించి వారి కార్యదర్శి సమక్షంలో సంతకం పెట్టడం జరిగింది.ఏదిఏమైనా నాయకుడి ఆదేశాలు పాటించాలికాబట్టి మంచి కోసమే సంతకాలు పెట్టడం జరిగింది".ఒక శాఖకు సంబంధించిన ఫైల్ ఆ శాఖ మంత్రిద్వారా ముఖ్యమంత్రికి వెళ్తుందా,లేక మన మంత్రిగారు సిగ్గు, లజ్జ లేకుండా ఒప్పుకొన్నట్లు నేరుగా ముఖ్యమంత్రి పేషీలో కార్యదర్శి చెప్పినచోట మంత్రి సంతకం పెడతాడా?

భారతరాజ్యాంగం ప్రకారం,చట్టబధ్థంగా అందరికీ సమన్యాయం చేస్తానని,భయ రాగద్వేషాలకతీతంగా నిర్ణయాలు తీసుకుంటానని ప్రమాణం చేసి తద్విరుధ్థంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ,చట్టవిరుధ్థమైన నిర్ణయాలు తీసుకొని ప్రజల సొమ్ము లూటీ చేయడమా?అన్ని పాలనా నియమాలను తుంగలో తొక్కి రాశేరె మరియు ఆయన మంత్రివర్గం చేసిన నిర్వాకం నివ్వెరపరుస్తోంది.అది సచివాలయమా లేక దొంగల ముఠానాయకుడి గుహా? ఇంత జరిగినా ఈయనతోబాటు రాజ్యాంగానికి బధ్థులమౌతామని ప్రమాణాలు చేసిన సహచరమంత్రులు ఈయనకు బాసటగా నిలుస్తామని ప్రకటించడం కొసమెరుపు.

వీళ్ళు రాజ్యాంగానికి బధ్థులైన ప్రజాసేవకులా లేక బందిపోటు దొంగలా?

తెలుగింటి పంచతంత్రం

పొద్దున్నే పేపర్ తెరవాలంటేనే భయపడే రోజులొచ్చాయి.కెసియార్ ఎవర్ని బూతులు తిడతాడో,ఏ తిండి పదార్ధాన్ని పేడ-పెంట అంటాడో?జగన్ ఎవరికి శాపనార్ధాలు పెడతాడో,ఎవర్ని వోదారుస్తాడో?,చంద్రబాబు ఎవరి గుండెల్లో నిద్రపోతాడో,ఎవర్ని అవినీతిపరుడంటాడో ?,కికురె,రాశేరె హయాంలో జరిగిన హత్యలు,స్కాములనుంచి ఎవర్ని రక్షించానంటాడో?,చిరంజీవి సామాజిక న్యాయం గురించి మనకు తెలియనివెన్ని చెబుతాడో ?,ఏ జాక్ వాళ్ళు ఎప్పుడు బందంటారో?చర్లపల్లి ఖైదీలెవర్ని తంతారో?ఏ భగ్న ప్రేమికుడెవరి గొంతు కోసాడో?నని హడలిచచ్చే రోజులు.
ఇంకా చిత్ర విచిత్ర వార్తలు.దేశ రక్షణమంత్రి,సోనియా దూతగా చిరంజీవి ఇంటికెళ్ళి కాంగ్రెస్ను రక్షించమని వేడుకోవడం!కాల్మొక్కుతా,భాంచను దొరా అనే కాకాకు,అకస్మాత్తుగా సోనియా విదేశీ వనిత అని గుర్తుకు రావడం!ప్రత్యేక తెలంగాణా ఇస్తావా,పదవి దిగుతావా అని హూంకరించడం!రాజకీయనాయకులు ఒకళ్ళనొకళ్ళు కలసగూడదా?అని కికురె మీడియా వాళ్ళను గద్దించడం!కాంగ్రెస్,జగన్ వర్గం ఒకళ్ళమీదొకళ్ళు బస్తీమే సవాల్ అని జబ్బలు చరవడం!జగన్ వర్గం,కాంగ్రెస్ కూ తెదేపా కు మ్యాచ్ ఫిక్సింగ్ అని అరోపించడం!పావలా వడ్డీ పధకం మా ఐడియా అని ఒకరంటే,చిరంజీవిని కాంగ్రెస్లో కలుపుకొమ్మని రాశేరె మేడమ్మ కప్పుడే ఉత్తరం రాశాడని ఇంకొకరు.అంతా అయోమయం గందరగోళం.హాల్లో కార్ల్ మార్క్స్ ఫోటో పెట్టుకొని,మాతాత ఫొటో అని మురిపెంగా చెప్పుకొనే నా మార్క్సిస్ట్ స్నేహితుడు చలసాని శిశిర్ తో నాసందేహనివృత్తి చేసుకొందామని,తన మార్క్సిస్ట్ విస్లేషణలతో నాబాధకు కొంతైనా ఉపశమనం కలుగుతుందని ఆయన ఇంటిదారి పట్టాను.ఏకరువు పెట్టిన నా బాధలన్నీ శ్రధ్ధగా విని,కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో,దాస్ కాపిటల్ నుంచి విస్తృతంగా కోట్ చేస్తూ పై పరిణామాలకు విశ్లేషణలిచ్చాడు తన కమ్యూనిస్ట్ పరిభాషలో .నాకొక్క ముక్క అర్థమైతే ఒట్టు.నా బుర్రలో సమస్యలింకా జటిలమై అచ్చు ఆంధ్రప్రదేష్ పరిస్థితిలా గందరగోళమయ్యింది .గతమెంతో ఘన కీర్తిగల తెలుగువాడిగా చెయ్యెత్తి ఎవరికి జై కొట్టాలో అర్థం కావటల్లేదన్నా నా మిత్రుడితో.అర్థం కాకపోవడంలో నీతప్పు లేదు,మా కమ్యూనిస్ట్లు చెప్పేవి ఒక్కొక్కసారి వాళ్ళకే అర్థం కావు.ఐదుగురు నాయకుల పంచతంత్ర కధ చెబుతా,చిరంజీవి స్టైలులో నీకు బాగా స్పష్టత వస్తుంది,ఆ విధంగా ముందుకు పోదామన్నాడు శిశిర్.
సోనియా,చంద్రబాబు,చిరంజీవి,కెసియార్,జగన్ క్లబ్ లో సిండికేటు ఆట ఆడుతున్నారు.పేకలో ఒకటే జోకర్ ఉంది.అందరూ తప్పనిసరిగా(కంపల్సరీ)ఆడ వలసిన స్టేజిలో ఉంది ఆట.1)సోనియా2)చిరంజీవి3)జగన్4)చంద్రబాబు5)కెసియార్,ఈక్రమంలో కూర్చొన్నారు ఆటగాళ్ళు.క్లబ్లో కార్డ్లు పంచేవాడు వీరప్పమొయిలీ.ఒక్కొక్కరికీ 13 కార్డ్లు పంచాదు మొయిలీ.
ఒకే ఒక్క కార్డుతో షో చేసేటట్లు మ్యానేజ్ చేయమని మొయిలీతో ముందుగానే మాట్లాడుకొన్న సోనియా చిద్విలాసంగా కార్డులు ఎత్తుకొంది.
1)సోనియా:-డీల్ షో వేయవల్సిన ఆట ఇలా వేసి చచ్చాడేంటి వీడు?ఇందులో ఏదో కుట్ర వుంది.రేండు ట్రిప్లెట్లు,మిగతావన్నీ మంచి పెయిర్లు.సరే అయిందేదో అయింది.జాగ్రత్తగా ఆడితే గెలిచే ఛాన్సుంది.జగన్ ను చంద్రబాబును గెలవనీయకుండా జాగ్రత్త పడితే చాలు.కెసియార్,చిరంజీవిలవి నా డమ్మీ హాండ్లేగదా!
2)చిరంజీవి:-4 కార్డ్ ల ట్రిప్లెట్,రెండు సీక్వెన్స్ పెయిర్లు,మిగతావన్నీ వేస్ట్ కార్డ్ లయినా ఆట మంచాటే.ఆమె కొట్టే కార్డుతోనే బ్రతకాలి.అయినా మా ఇద్దరి ఒడంబడిక ప్రకారం ,సోనియా షోతిప్పితే నాకు వాటానిస్తానందిగాబట్టి నాకేం ఢోకా లేదు.ఆట బ్రహ్మాండంగా ఆడొచ్చు.
3)jagan:-నాలుగు కార్డుల సీక్వెన్స్,రెండు ట్రిప్లెట్ పెయిర్లు,రెండు సీక్వెన్స్ పెయిర్లు.పేకలోంచి మంచికార్డులొస్తాయి.ఆట తిప్పేది నేనే.సోనియాకు నాకు మధ్యలో ఈ చిరంజీవొకడు కూర్చున్నాడు గాని లేకపోతే నాకు కావాల్సిన కార్డులన్నీ ఆమె చేతిలోనే ఉన్నాయి.చిరంజీవి అడ్డం లేకపోతే మూడు రౌండ్లలోనే నేను షో చేసేవాడిని.ఏదోఒకటి చేసి సోనియాను మాత్రం షో చెయ్యనివ్వను.
4)chandrababu:-నాలుగు కార్డుల సీక్వెన్స్,రెండు ట్రిప్లెట్లు,ఒక అప్ డౌన్ పెయిర్.ఏసి,డీసి.ఒకే ఒక కార్డుతో షో ఉంది కాని అది రాలేదో ఫుల్ కౌంట్.ఇంకో ఆట ఆడటానికి డబ్బులుగూడా లేవు.టేబుల్ లో ఉన్న మిగతా నలుగురూ నాకు శత్రువులే.ఎప్పుడు ఎవరు ఏకమౌతారో?వాళ్ళ మధ్య లోపాయకారీ ఒప్పందాలేమిటో?ఆలోచిస్తే బుర్ర ఖరాబ్.చాలా జాగర్తగా ఆడాలి.మిగతావాళ్ళానందరినీ ఒక కంట కనిపెట్టాలి.
5)కెసియార్:-ఆటలో ఉన్న ఒక్క జోకర్ నాకే వచ్చింది.మిగతా 12 కార్డులూ ఒకదానికొకటి సంబంధం లేని వేస్ట్ కార్డులే.నా ఆట ఎట్టిపరిస్థుతలలోనూ షో అవదు.అయితేమాత్రం నాదేం ఊడింది.నా ఆటకు పైసలు కట్టింది సోనియానే గదా.కాంగ్రెస్,జగన్ లలో ఎవరు షో తిప్పినా బేరం కుదుర్చుకొని తృణమో,ఫణమో గిట్టించుకోవచ్చు.చంద్రబాబుదొక్కడిదీ షో అవకుండా ఉంటే చాలు.
ఆట నీకర్థమయింది గదా అని అడిగాడు శిశిర్.కధ చెప్పినవాడివి విశ్లేషణ గూడా చెప్పమన్నా.జోకర్,సీక్వెన్స్,ట్రిప్లేట్లతో సోనియా కు ఆట పంచాల్సిన మొయిలీ తన అసమర్థతో ఆ రిగ్గింగ్ పని చేయలేకపోయాడు.సోనియా కొట్టే కార్డులు చిరంజీవికి పనికిరావు,వాటితోనే జగన్ కు షో అయినా చిరంజీవి మధ్యలో ఉండటం మూలాన ఎత్తలేడు.జగన్ అనాలోచితంగా కొట్టే కార్డులతో చంద్రబాబుకు షోతిరిగే ఆస్కారం ఉంది.చంద్రబాబు కొట్టే కార్డులు,కెసియార్ ఎత్తినా ,బాబును భయపెట్టడానికేకానీ షో తిప్పడానికి పనికిరావు.కెసియార్ దగ్గరున్న తెలంగాణా అనే జోకర్,సీక్వెన్స్,ట్రిప్లెట్ ల సపోర్ట్ ఉంటే పనికివస్తుందుగానీ అవి లేకుండా నిరర్థకం.కెసియార్ జోకర్ కొడితే సోనియాకు షో అవుతుంది కాని ఆట నియమాలందుకు ఒప్పుకోవు.మరి రాఘవులు,నారాయణ సంగతేంటి అని అడిగాను.ఇద్దరూ గోదావరి ఒడ్డు మీద నించొన్నారు,ఆటలో ఎవరుగెలిస్తే వాళ్ళ తోక పట్టుకొని ఈదుదామని,అన్నాడు శిశిర్.
ఇప్పుడర్థమయిందిగదా మన నేతల సమస్యలు అన్నాడు శిశిర్.అర్థమయ్యింది గాని నా బుర్ర తిరుగుతోంది నేనిక వస్తానని ఇంటిదారి పట్టా.

తెలంగాణా వాదం -మేధావులా?మేతావులా?-1

'నాకు నెలకు లక్ష జీతం వట్టిగ ఇస్తలేరు.30 ఏళ్ళుగా యూనివర్సిటీ కు సేవ చేస్తున్నా.ఉద్యోగం చేస్తున్నంతమాత్రాన సర్కారుకు విశ్వసనీయుడుగా ఉండాల్సిన అవసరం లేదు.రాజ్యాంగానికి మాత్రమే విశ్వాసపాత్రుడిగా ఉంటా.ఒక పౌరునిగా కర్తవ్యాన్ని నిర్వర్స్తిస్తా.' అని శలవిచ్చారు తెలంగాణ జాక్ చైర్మన్ ప్రొ.కోదండరాం .
గవర్నరుగానో,రాష్ట్రపతిగానో,లేక ఎన్నికలప్రధానాధికారిలాంటి రాజ్యాంగబధ్ధమైన పదవుల్లో ఉంటే రాజ్యాంగానికి విశ్వసనీయుడుగా ఉంటానంటే అర్ధముందిగాని,విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడుగా ఉన్న ఈయన రాజ్యాంగానికి విశ్వాసపాత్రుడుగా ఉంటాననడం తననుగురించి తాను ఎక్కువగా ఊహించుకొని పలికే ప్రగల్భాలు,వ్యర్ధ ప్రేలాపనలు.
నాయనా ప్రొ.కోదండరాం మీదేమీ రాజ్యాంగపరమైన కొలువు కాదు.విశ్వవిద్యాలయ నౌకరీనిబంధనల కనుగుణంగా మీకు ప్రొ.ఉద్యోగం ఇచ్చారు.ఈ ఉద్యోగ సక్రమ నిర్వహణకు రాజ్యాంగం లాంటి పెద్దమాటలు వాడాల్సిన పని లేదు.గత రెండు ఏళ్ళుగా ప్రత్యేక తెలంగాణా తలకెత్తుకొని ,నిరుద్యోగ రాజకీయనాయకులతో కలసి,సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతూ,అరాచకాలు సృష్టిస్తూ కాలయాపన చేస్తున్నారుగాని ప్రొఫెసర్ గా మీవిధులు నిర్వర్తించడం లేదు.విద్వేషాలు రెచ్చగొట్టడం,అరాచకం సృష్టించడం లాంటివి రాజ్యాంగవిరుధ్ధ కార్యక్రమాలే.విద్యార్ధుల తల్లితండ్రులు,తమ పిల్లలను విద్యాలయాలకు పంపేది విద్యాబుధ్ధులు నేర్పమనిగాని,ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలలో తర్ఫీదు ఇవ్వమని కాదు.
వెనకటికొకడు,పెళ్ళాం పిల్లలకు అన్నం పెట్టి దేశ సేవ చేశానన్నాడట.అలాగుంది ఈయన 30 ఏళ్ళు యూనివర్సిటీకి సేవ చేశాననడం.జీతం తీసుకోకుండా,నిస్వార్ధంగా విద్యార్ధులకు విద్యాబోధ చేస్తేనో,తన సొంతసొమ్ముతో యూనివర్సిటీకి లైబ్రరీ భవనాలో,ఆడిటోరియమో నిర్మించి ఇస్తేనో ,భూవిరాళం చేస్తేనో,దాన్ని సేవ చేయడం అంటారు కాని ఇది సేవ ఎలాగౌతుందో ఆయనే విశదీకరించాలి.చేశే ఉద్యోగానికి నెలనెలా జీతం పొందుతూనే ఉన్నాడు గదా!రాశేరె లక్ష కోట్లు దోచి రాష్ట్రానికి 5.1/2 ఏళ్ళు సేవచేశాననడం,గాలి జనార్ధన రెడ్డి,అక్రమంగా ఖనిజ సంపదను దోచి,దాన్ని విదేశాలకు తరలించి అప్పణంగా కోట్లు కూడబెట్టి,కర్ణాటకకు,దేశానికి సేవ చేశాననడం ఎంత నిజమో,ఈయనసేవ కూడా అంతే నిజం.
సర్కారు యుజిసి కి సొమ్ము మంజూరు చేస్తే,దానినుంచి యూనివర్సిటీలకు గ్రాంటు రూపంలో అందుతుంది.ఉద్యోగుల జీతభత్యాల దగ్గరనుంచి,ఉపాధ్యాయులు వివిధ సదస్సులలో పాల్గొనేటందుకు,మరియు అనేక ఇతర కార్యక్రమాలను నెరవేర్చేటందుకు అయ్యే వ్యయమంతా సర్కారు నుంచి అందేదే.దీన్నిబట్టి విషయ పరిజ్ఞానం,సరైన అవగాహన ఉన్న వ్యక్తి ఎవరికి విశ్వాసపాత్రుడుగా ఉండాలో తానే నిర్ణయించుకుంటాడుగాని,ఇలాంటి హాస్యాస్పద ప్రకటనలతో తన సామర్ధ్యలేమిని బహిర్గతం చేసుకోడు.ఏదిఏమైనా ఒక ప్రొఫెసర్ ,యూనివర్సిటీకి ,విద్యార్ధుల తల్లితండ్రులకు మాత్రం విశ్వసనీయుడుగా ఉండవలసిందే.
ఒక ఉపాధ్యాయుడుగా,సమాజానికి మార్గదర్శకుడుగా నిలవాల్సిన వ్యక్తి,ఒక పౌరుడిగా కర్తవ్యాన్ని నిర్వహిస్తాననడం ఒక అలంకారిక పదప్రయోగం మాత్రమే.ఉద్యోగ బాధ్యతలను విస్మరించి చేపట్టే విధ్వంస కార్యక్రమాలకు,ఈ అత్మవంచనల కికనైనా స్వస్తి పలికి,ఒక సామాన్యపౌరుడిగా తన కర్తవ్యం(?) నిర్వర్తించాలనుకుంటే ,తక్షణమే ఉద్యోగానికి రాజీనామా చేసి,తన ప్రత్యర్ధులకు తొడ కొడతాడో,వాళ్ళతో కలబడతాడో తేల్చొకొంటే అది సమంజసంగా ఉంటుంది.
(నా స్నేహితుడు చలసాని శిశిర్ మార్గదర్శకంలో వ్రాసినది)

రాశేరె అడుగు జాడల్లో కి.కు.రె -ఖిన్నుడైన జగన్

రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కికురె, రాశేరె కి ఘనంగా నివాళుళు అర్పించారు.రాశేరె ప్రారంభించిన పధకాలన్నిటినీ కొనసాగిస్తానని,ఆయనకు అసలైన వారసులము తామేనని పునరుధ్గాటించారు.కాంగ్రెస్ అధికారంలో లేని సమయంలో తనలాంటివారు షుమారు 100 మంది రాశేరె తోబాటు కష్టనష్టాలనెన్నో ఎదుర్కొని ఆయనకు సహకారం అందించి,ఇటుక ఇటుక పేర్చబట్టే ఆయన రాజకీయంగా ఎదిగాడని,కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రోత్సాహంతోనే రెండుసార్లు ముఖ్యమంత్రి అవగలిగాడని విశదీకరించారు.ఈ క్రమంలోనే ఆయన రెండు ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు.
రాశేరె తనకొక పని పురమాయించారని,కానీ స్పీకర్ విధినిర్వహణలో తనకు కొన్ని నియమనిబంధనలున్నాయని ,వాటిని అతిక్రమించడం భావ్యం కానందున , ఆ పని చేయడానికి తాను తిరస్కరించానని తెలిపారు.ఈ ఉదంతం గురించి ఇప్పుడు మాట్లాడటంలో ము.మం ఉద్దేశ్యం ఏదైనా ఒక సంగతి మాత్రం విష్పష్టం.అన్నిపార్టీల ప్రజాప్రతినిధులను సమదృష్టితో చూసి,నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ ను,నిబంధనలకు విరుధ్ధంగా పనిచేయమని అప్పటి ము.మం రాశేరె పురమాయించాడంటే తన మంత్రివర్గ సహచరులతోను,అడుగులకు మడుగులొత్తే అధికారగణంతోను,ఎన్ని అకృత్యాలు ఏస్థాయిలో చేయించిఉంటాడో ఊహకందని విషయం.రాశేరె అడుగుజాడలలో నడుస్తూ ఈయనెన్ని అకృత్యాలకొడగడతాడో గదా!ఇప్పటివరకు రాశేరె మీద ప్రతిపక్షాలు అభియోగించిన అధికారదుర్వినియోగ ఆరోపణలన్నీ నూటికినూరు శాతం నిజాలని ము.మం. అంగీకరించినట్లైంది.రాశేరె ము.మం.గా స్పీకర్ కి.కు.రె కి పురమాయించిన పనేమిటో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రస్తుత ము.మం. కికురె పై ఉంది.
కికురె ప్రస్తావించిన రెండో అంశం పరిటాల రవి హత్యోదంతం.పరిటాల రవి హత్యకు జగన్ బాధ్యుడని ప్రతిపక్షం చేసిన ఆరోపణలను 60 రోజులు అసెంబ్లీలో ఎదుర్కొన్నాని,రాశేరె తనమీద పూర్తివిశ్వాసం ఉంచి తననొక్కమారుగూడా ఈవిషయం గురించి అడగలేదని చెప్పుకొచ్చారు.రాశేరె మీద వాలిన ఈగనుకూడా చంపకుండా వదలలేదని,ఆకుటుంబం మీద వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టే క్రమంలోనే తెదేపాతో శతృత్వం పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పారు.తన సహచర ప్రజాప్రతినిధి హత్యకు గురైతే ,హత్యకు పాల్పడినవారిని గుర్తించే పరిశోధనకు సహకరించి , దోషులకు శిక్ష పడేలా చూడటం ఒక ప్రజాప్రతినిధిగా,శాసనకర్తగా ఆయన కర్తవ్యం.తన బాధ్యతను విస్మరించి ,నిజానిజాలతొ,న్యాయాన్యాలతో సంబధం లేకుండా ఒక ముఠా సభ్యుడుగా,ఒక వర్గం ప్రతినిధిగా తాను చేసిన సిగ్గుమాలినపనినొక సుగుణంగా చూపించడానికి ప్రయత్నించడం నీతిబాహ్యమైన చర్య.ఫూడల్ భావజాలంతో , ఒక సంకుచిత చట్రంలో ఇమిడిన వ్యక్తిగానే కికురె ని అభివర్ణించాలి.
రాశేరె రాజకీయవారసులు తమ వంటివారేనని యోగ్యతాపత్రం ఇచ్చుకొన్న కికురె,ఆయన్ను ఆదర్శంగా తీసుకొని ఎన్ని అఘాయిత్యాలకొడగడతాడో,ఎన్ని దోపిడీలకు పాల్పడతాడో,ఎన్ని స్కాములు నెరపుతాడో వేచిచూడాల్సిందే!కాంగ్రెస్ ను కేంద్రంలోను రాష్ట్రంలోను గెలిపించిన ఘోర తప్పిదానికి ఆంధ్రప్రదేష్ ప్రజలింకెంత మూల్యం చెల్లించాలో?

రెండురెళ్ళుఆరు-ఆంధ్రప్రదేష్ నం .1

'ఒకేదెబ్బకు రెండు పిట్టలు ' అనే సిధ్ధాతం అమలుచేస్తూ,ప్రతిపక్షం తెదేపా ను మరియు తెలంగాణా ప్రాతంలో జగన్ ప్రభావాన్ని నామమాత్రం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆడిన వికృతరాజకీయక్రీడలో భాగమే డెసెంబర్ 9,2009 న చిదంబరం ప్రకటన.ఆంధ్రప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులనుంచి ఎదురైన ప్రతిఘటనను ఏమాత్రం అంచనా వేయలేని కాంగ్రెస్ అధిష్ఠానం ,సంకటపరిస్థులనుంచి తాత్కాలిక ఉపశమనం పొందడానికి,కొంత అదనపు సమయం గడించడానికి చేసిన ఏర్పాటే శ్రీకృష్ణ కమిటీ అన్నవిషయం మనకందిరికీ తెలుసు.
'రెండు ప్రాంతాలు నాకు రెండు కళ్ళతో సమానం' అనే స్లోగన్ తో గెడ కర్ర మీదెక్కిన యాక్రోబాట్ లా విన్యాసాలు చేస్తూ ,సంకటస్థితి నుంచి చాకచక్యంగా అతితక్కువ నష్టంతో బయటబడగలిగాడు చంద్రబాబు.
'ఆ రెండూ నాకొద్దు అని ,సోనియా తమ కుటుంబాన్ని చీల్చిందన్న కుంటిసాకుతో పార్లమెంట్,అసెంబ్లీ స్థానాలకు తల్లితో సహా రాజీనామా చేయించి,కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతపార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నాడు జగన్.
'రెంటికీ చెడ్డ రేవడయ్యిందీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.ఈ సమస్యను పార్టీలే పరిష్కరించాలని,చేతులు దులుపుకొనే ప్రయత్నం చేసిన చిదంబరం వ్యూహాన్ని ,కెసిఆర్ చూపిన బహిష్కరణ మార్గం ద్వారానే ఛేదించాడు చంద్రబాబు.ఏడ్చి,మొత్తుకొని ప్రణబ్ ముఖర్జీ కాళ్ళమీదపడిన తెలంగాణా ప్రజాప్రతినిధులకు జగన్ బూచిని చూపాల్సిన దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ పార్టీది.తమ అబధ్ధపు ప్రచారాలలోని డొల్లతనాన్ని,ప్రభుత్వం సమకూర్చిన సాధికారక గణాంకాల తోడ్పాటుతోనే ఎత్తిచూపిన శ్రీకృష్ణ కమిటీని ఆడిపోసుకోవడం,నివేదికను పక్కనబెట్టి ,ప్రత్యేక తెలంగాణా బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే పెట్టాలనే తొండి వాదననే నెత్తికెత్తుకోవాల్సిన దుస్థితి ప్రత్యేకవాదులది.
'రెండు రెళ్ళు ఆరు లాంటి అసంబధ్ధ రాజకీయక్రీడలకికనైనా ముగింపు పలికి ,శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఆరో ప్రత్యామ్నాయం ఎంచుకొని ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నం.1 గా తీర్చిదిద్దటం కాంగ్రెస్ పాలనలోనున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం.

జగన్నాటకం-2

అదపాదడపా అంతర్జాలంలోనూ,కొద్ది మంది స్నేహితుల మధ్య సంభాషణలలోనూ ఈ మధ్య తరచుగా వినబడుతున్నమాట 'ఏదిఏమైనా జగన్ మగాడు,సగటు కాంగ్రెస్ వాదుల్లాగా సోనియాకు దాసోహమనకుండా ,ఆమె మీద విమర్శనాస్త్రాలెక్కుపెడుతూ ,125 సం: చరిత్రగల కాంగ్రెస్ పార్టీకు సవాల్ గా మారాడని. ఈ అభిప్రాయం సమంజసమా కాదా అనేది పరిశీలిద్దాం.
విదేశీ వనిత అనే విషయాన్ని పక్కకుపెడితే సోనియా ను విమర్శించేవాళ్ళ ముఖ్య అభియోగాలేమిటి?1) కాంగ్రెస్ పార్టీ లో ప్రజాస్వామ్యానికి పాతరేసి ,రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా అన్ని పదవులలో తన ఇష్టం వచ్చిన నాయకులను కూర్చోబెడుతుంది.2) ప్రజాస్వామ్యానికి పూర్తిగా వ్యతిరేకమైన కుటుంబపాలన తో పార్టీ మీద ప్రభుత్వం మీద పూర్తి ఆధిపత్యం చెలాయిస్తుంది. 3)మన్మోహన్ సింగ్ లాంటి కీలుబొమ్మలను పదవిలో కూర్చోబెట్టి ,కీలకనిర్ణయాలన్నీ తను తీసుకొంటూ ప్రభుత్వ వైఫల్యాలకు ప్రధానిని బాధ్యుడిని చేస్తూ, పార్టీ మరియు ప్రభుత్వ విజయాలను తన ఖాతాలో వేసుకొంటుంది. 4) కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను,కేంద్ర మంత్రులను తన కలక్షన్ ఏజెంట్లుగా వాడుకొంటూ అవినీతి కూపంలో మునిగిపోయింది.
రాశేరె ఆరేళ్ళ పాలనలో మన రాష్ట్రంలో జరిగిన నిర్వాకం ఏమిటి? తన అనుయాయులను యోగ్యతాయోగ్యతలతో నిమిత్తం లేకుండా కీలక పదవుల్లో కూర్చోబెట్టిన సంఘటనలు కోకొల్లలు.కుటుంబ వారసత్వ రాజకీయాల్లో భాగంగా రాజకీయ ఆరంగేట్రం చేసినవాడు,తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని అక్రమార్జన చేసినవాడు,ప్రజా సమస్యల గురించి ఏనాడూ ఉద్యమించనివాడు,ఏమాత్రం రాజకీయానుభవం లేనివాడు,చనిపోయిన ముఖ్యమంత్రి వారసుడుగా మాత్రమే లోకానికి తెలిసినవాడు,ముఖ్యమంత్రి పదవినాశించడం ఏవిధంగా సమర్ధనీయం?
2004 ఎన్నికల్లో మరియు 2009 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడటానికి తన తండ్రే కారణమనే వితండవాదంతో,తన గొంతెమ్మ కోర్కె సోనియా తీర్చలేదనే అక్కసుతో, కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేసి,పార్టీను,అధ్యక్షురాలిని దూషిస్తున్నాడు.సైధ్ధాంతికంగా,నైతికంగా,ప్రజాసేవాపరంగా ముఖ్యమంత్రి పదవినధిష్టించడానికి ఏరకంగా అర్హుడు?సోనియాగాంధీ తన కుటుంబాన్ని చీల్చిందని అభియోగం మోపుతున్నాడుగాని ,అది అబధ్ధమని జగన్ బాబాయి ఎన్నో మార్లు వివరణ ఇచ్చుకున్నాడు.ఇంత జరిగినా సోనియా, జగన్ ను పిలిచి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే జై సోనియా అనడా? ఆమె ముందు మోకరిల్లడా?
జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తే తన తండ్రి పాలనను మరపిస్తానని,స్వర్ణయుగం తెస్తానని,30 ఏళ్ళు నిర్విఘ్నంగా పరిపాలిస్తానని అంటున్నాడు .అవినీతి,కుంభకోణాలు,ఆశ్రితపక్షపాతం,వనరుల దోపిడీ,వ్యవస్థల కుప్పకూల్చడం లాంటి పనులన్నీ యధేచ్ఛగా చేస్తానని హెచ్చరించడమన్నమాట.
సిధ్ధాంతాల ప్రాతిపదికన,నైతిక విలువలకోసం లేక ప్రజా హితం కోసం సోనియాను ఎదురిస్తున్నాడా? లేక తన స్వార్ధ ప్రయోజనాలకోసం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి ,తన అక్రమ సంపాదనను కాపాడుకోవడానికో,తన ముఠాసభ్యులతో రాష్ట్రాన్ని మరింత దోచుకోవడంకోసం ఈ అలజడి సృష్టిస్తున్నాడా? ప్రజాస్వామ్యవాదులు,సమాజం అభివృధ్ధిపధంలో పయనించాలని కోరుకునే అభ్యుదయవాదులు,చదువుకొన్న సంస్కారవంతులు,ఇటువంటి అఘాయిత్యాలకు అంతిమంగా బలయ్యే అమాయక ప్రజానీకం , పై రెండు ప్రశ్నలలో ఒక సమాధానాన్ని ఎంచుకొని జగన్ పయనిస్తున్న బాట హర్షనీయమో కాదో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైనది.
(ఈ వ్యాసం నా స్నేహితుడు చలసాని శిశిర్ మార్గ దర్శ్యకత్వంలో వ్రాసినది.)