'నాకు నెలకు లక్ష జీతం వట్టిగ ఇస్తలేరు.30 ఏళ్ళుగా యూనివర్సిటీ కు సేవ చేస్తున్నా.ఉద్యోగం చేస్తున్నంతమాత్రాన సర్కారుకు విశ్వసనీయుడుగా ఉండాల్సిన అవసరం లేదు.రాజ్యాంగానికి మాత్రమే విశ్వాసపాత్రుడిగా ఉంటా.ఒక పౌరునిగా కర్తవ్యాన్ని నిర్వర్స్తిస్తా.' అని శలవిచ్చారు తెలంగాణ జాక్ చైర్మన్ ప్రొ.కోదండరాం .
గవర్నరుగానో,రాష్ట్రపతిగానో,లేక ఎన్నికలప్రధానాధికారిలాంటి రాజ్యాంగబధ్ధమైన పదవుల్లో ఉంటే రాజ్యాంగానికి విశ్వసనీయుడుగా ఉంటానంటే అర్ధముందిగాని,విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడుగా ఉన్న ఈయన రాజ్యాంగానికి విశ్వాసపాత్రుడుగా ఉంటాననడం తననుగురించి తాను ఎక్కువగా ఊహించుకొని పలికే ప్రగల్భాలు,వ్యర్ధ ప్రేలాపనలు.
నాయనా ప్రొ.కోదండరాం మీదేమీ రాజ్యాంగపరమైన కొలువు కాదు.విశ్వవిద్యాలయ నౌకరీనిబంధనల కనుగుణంగా మీకు ప్రొ.ఉద్యోగం ఇచ్చారు.ఈ ఉద్యోగ సక్రమ నిర్వహణకు రాజ్యాంగం లాంటి పెద్దమాటలు వాడాల్సిన పని లేదు.గత రెండు ఏళ్ళుగా ప్రత్యేక తెలంగాణా తలకెత్తుకొని ,నిరుద్యోగ రాజకీయనాయకులతో కలసి,సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతూ,అరాచకాలు సృష్టిస్తూ కాలయాపన చేస్తున్నారుగాని ప్రొఫెసర్ గా మీవిధులు నిర్వర్తించడం లేదు.విద్వేషాలు రెచ్చగొట్టడం,అరాచకం సృష్టించడం లాంటివి రాజ్యాంగవిరుధ్ధ కార్యక్రమాలే.విద్యార్ధుల తల్లితండ్రులు,తమ పిల్లలను విద్యాలయాలకు పంపేది విద్యాబుధ్ధులు నేర్పమనిగాని,ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలలో తర్ఫీదు ఇవ్వమని కాదు.
వెనకటికొకడు,పెళ్ళాం పిల్లలకు అన్నం పెట్టి దేశ సేవ చేశానన్నాడట.అలాగుంది ఈయన 30 ఏళ్ళు యూనివర్సిటీకి సేవ చేశాననడం.జీతం తీసుకోకుండా,నిస్వార్ధంగా విద్యార్ధులకు విద్యాబోధ చేస్తేనో,తన సొంతసొమ్ముతో యూనివర్సిటీకి లైబ్రరీ భవనాలో,ఆడిటోరియమో నిర్మించి ఇస్తేనో ,భూవిరాళం చేస్తేనో,దాన్ని సేవ చేయడం అంటారు కాని ఇది సేవ ఎలాగౌతుందో ఆయనే విశదీకరించాలి.చేశే ఉద్యోగానికి నెలనెలా జీతం పొందుతూనే ఉన్నాడు గదా!రాశేరె లక్ష కోట్లు దోచి రాష్ట్రానికి 5.1/2 ఏళ్ళు సేవచేశాననడం,గాలి జనార్ధన రెడ్డి,అక్రమంగా ఖనిజ సంపదను దోచి,దాన్ని విదేశాలకు తరలించి అప్పణంగా కోట్లు కూడబెట్టి,కర్ణాటకకు,దేశానికి సేవ చేశాననడం ఎంత నిజమో,ఈయనసేవ కూడా అంతే నిజం.
సర్కారు యుజిసి కి సొమ్ము మంజూరు చేస్తే,దానినుంచి యూనివర్సిటీలకు గ్రాంటు రూపంలో అందుతుంది.ఉద్యోగుల జీతభత్యాల దగ్గరనుంచి,ఉపాధ్యాయులు వివిధ సదస్సులలో పాల్గొనేటందుకు,మరియు అనేక ఇతర కార్యక్రమాలను నెరవేర్చేటందుకు అయ్యే వ్యయమంతా సర్కారు నుంచి అందేదే.దీన్నిబట్టి విషయ పరిజ్ఞానం,సరైన అవగాహన ఉన్న వ్యక్తి ఎవరికి విశ్వాసపాత్రుడుగా ఉండాలో తానే నిర్ణయించుకుంటాడుగాని,ఇలాంటి హాస్యాస్పద ప్రకటనలతో తన సామర్ధ్యలేమిని బహిర్గతం చేసుకోడు.ఏదిఏమైనా ఒక ప్రొఫెసర్ ,యూనివర్సిటీకి ,విద్యార్ధుల తల్లితండ్రులకు మాత్రం విశ్వసనీయుడుగా ఉండవలసిందే.
ఒక ఉపాధ్యాయుడుగా,సమాజానికి మార్గదర్శకుడుగా నిలవాల్సిన వ్యక్తి,ఒక పౌరుడిగా కర్తవ్యాన్ని నిర్వహిస్తాననడం ఒక అలంకారిక పదప్రయోగం మాత్రమే.ఉద్యోగ బాధ్యతలను విస్మరించి చేపట్టే విధ్వంస కార్యక్రమాలకు,ఈ అత్మవంచనల కికనైనా స్వస్తి పలికి,ఒక సామాన్యపౌరుడిగా తన కర్తవ్యం(?) నిర్వర్తించాలనుకుంటే ,తక్షణమే ఉద్యోగానికి రాజీనామా చేసి,తన ప్రత్యర్ధులకు తొడ కొడతాడో,వాళ్ళతో కలబడతాడో తేల్చొకొంటే అది సమంజసంగా ఉంటుంది.
(నా స్నేహితుడు చలసాని శిశిర్ మార్గదర్శకంలో వ్రాసినది)