అదపాదడపా అంతర్జాలంలోనూ,కొద్ది మంది స్నేహితుల మధ్య సంభాషణలలోనూ ఈ మధ్య తరచుగా వినబడుతున్నమాట 'ఏదిఏమైనా జగన్ మగాడు,సగటు కాంగ్రెస్ వాదుల్లాగా సోనియాకు దాసోహమనకుండా ,ఆమె మీద విమర్శనాస్త్రాలెక్కుపెడుతూ ,125 సం: చరిత్రగల కాంగ్రెస్ పార్టీకు సవాల్ గా మారాడని. ఈ అభిప్రాయం సమంజసమా కాదా అనేది పరిశీలిద్దాం.
విదేశీ వనిత అనే విషయాన్ని పక్కకుపెడితే సోనియా ను విమర్శించేవాళ్ళ ముఖ్య అభియోగాలేమిటి?1) కాంగ్రెస్ పార్టీ లో ప్రజాస్వామ్యానికి పాతరేసి ,రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా అన్ని పదవులలో తన ఇష్టం వచ్చిన నాయకులను కూర్చోబెడుతుంది.2) ప్రజాస్వామ్యానికి పూర్తిగా వ్యతిరేకమైన కుటుంబపాలన తో పార్టీ మీద ప్రభుత్వం మీద పూర్తి ఆధిపత్యం చెలాయిస్తుంది. 3)మన్మోహన్ సింగ్ లాంటి కీలుబొమ్మలను పదవిలో కూర్చోబెట్టి ,కీలకనిర్ణయాలన్నీ తను తీసుకొంటూ ప్రభుత్వ వైఫల్యాలకు ప్రధానిని బాధ్యుడిని చేస్తూ, పార్టీ మరియు ప్రభుత్వ విజయాలను తన ఖాతాలో వేసుకొంటుంది. 4) కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను,కేంద్ర మంత్రులను తన కలక్షన్ ఏజెంట్లుగా వాడుకొంటూ అవినీతి కూపంలో మునిగిపోయింది.
రాశేరె ఆరేళ్ళ పాలనలో మన రాష్ట్రంలో జరిగిన నిర్వాకం ఏమిటి? తన అనుయాయులను యోగ్యతాయోగ్యతలతో నిమిత్తం లేకుండా కీలక పదవుల్లో కూర్చోబెట్టిన సంఘటనలు కోకొల్లలు.కుటుంబ వారసత్వ రాజకీయాల్లో భాగంగా రాజకీయ ఆరంగేట్రం చేసినవాడు,తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని అక్రమార్జన చేసినవాడు,ప్రజా సమస్యల గురించి ఏనాడూ ఉద్యమించనివాడు,ఏమాత్రం రాజకీయానుభవం లేనివాడు,చనిపోయిన ముఖ్యమంత్రి వారసుడుగా మాత్రమే లోకానికి తెలిసినవాడు,ముఖ్యమంత్రి పదవినాశించడం ఏవిధంగా సమర్ధనీయం?
2004 ఎన్నికల్లో మరియు 2009 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడటానికి తన తండ్రే కారణమనే వితండవాదంతో,తన గొంతెమ్మ కోర్కె సోనియా తీర్చలేదనే అక్కసుతో, కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేసి,పార్టీను,అధ్యక్షురాలిని దూషిస్తున్నాడు.సైధ్ధాంతికంగా,నైతికంగా,ప్రజాసేవాపరంగా ముఖ్యమంత్రి పదవినధిష్టించడానికి ఏరకంగా అర్హుడు?సోనియాగాంధీ తన కుటుంబాన్ని చీల్చిందని అభియోగం మోపుతున్నాడుగాని ,అది అబధ్ధమని జగన్ బాబాయి ఎన్నో మార్లు వివరణ ఇచ్చుకున్నాడు.ఇంత జరిగినా సోనియా, జగన్ ను పిలిచి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే జై సోనియా అనడా? ఆమె ముందు మోకరిల్లడా?
జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తే తన తండ్రి పాలనను మరపిస్తానని,స్వర్ణయుగం తెస్తానని,30 ఏళ్ళు నిర్విఘ్నంగా పరిపాలిస్తానని అంటున్నాడు .అవినీతి,కుంభకోణాలు,ఆశ్రితపక్షపాతం,వనరుల దోపిడీ,వ్యవస్థల కుప్పకూల్చడం లాంటి పనులన్నీ యధేచ్ఛగా చేస్తానని హెచ్చరించడమన్నమాట.
సిధ్ధాంతాల ప్రాతిపదికన,నైతిక విలువలకోసం లేక ప్రజా హితం కోసం సోనియాను ఎదురిస్తున్నాడా? లేక తన స్వార్ధ ప్రయోజనాలకోసం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి ,తన అక్రమ సంపాదనను కాపాడుకోవడానికో,తన ముఠాసభ్యులతో రాష్ట్రాన్ని మరింత దోచుకోవడంకోసం ఈ అలజడి సృష్టిస్తున్నాడా? ప్రజాస్వామ్యవాదులు,సమాజం అభివృధ్ధిపధంలో పయనించాలని కోరుకునే అభ్యుదయవాదులు,చదువుకొన్న సంస్కారవంతులు,ఇటువంటి అఘాయిత్యాలకు అంతిమంగా బలయ్యే అమాయక ప్రజానీకం , పై రెండు ప్రశ్నలలో ఒక సమాధానాన్ని ఎంచుకొని జగన్ పయనిస్తున్న బాట హర్షనీయమో కాదో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైనది.
(ఈ వ్యాసం నా స్నేహితుడు చలసాని శిశిర్ మార్గ దర్శ్యకత్వంలో వ్రాసినది.)
1 comments:
సిధ్ధాంతాల ప్రాతిపదికన,నైతిక విలువలకోసం లేక ప్రజా హితం కోసం సోనియాను ఎదురిస్తున్నాడా? లేక తన స్వార్ధ ప్రయోజనాలకోసం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి ,తన అక్రమ సంపాదనను కాపాడుకోవడానికో,తన ముఠాసభ్యులతో రాష్ట్రాన్ని మరింత దోచుకోవడంకోసం ఈ అలజడి సృష్టిస్తున్నాడా?--the 2nd one is right
Post a Comment