చంద్రబాబు- సఫల ముఖ్యమంత్రి,విఫల రాజకీయనాయకుడు-ఒక విశ్లేషణ
తెదేపా ను సమూలంగా ప్రక్షాళన చేయడానికి` పల్లెపల్లెకు తెదేపా`అనే కార్యక్రమం చేపట్టారని ఈనాడు (sep 21 ) లో ఒక వార్తా వచ్చింది.పై పై పూతలతో బాగా ముదిరి పోయిన జబ్బు తగ్గుతుందా? రోగ నిర్ధారణ చేస్తేనే గదా వైద్య సహాయం అందించ గలిగేది.
మంచి ముఖ్యమంత్రి గా పేరు తెచ్చుకున్న చంద్రబాబు రాజకీయ నాయకుడు గా ఎందుకు విఫలం అయ్యాడు ? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం మౌలిక సమస్యల్లోకి వెళ్ళాల్సిందే.
ముఖ్యమంత్రి గా IT కు పెద్ద పీట వేసి హైదరాబాద్ ను చెన్నై, బెంగలూరు ల సరసన చేర్చి లక్షల మంది మధ్య తరగతి,దిగువ తరగతి,యువతకు ఈ రంగం లో ఉపాధి కల్పించాడు. ISB , IIIT లాంటి ఉన్నత విద్యాసంస్థలను నెలకొల్పి క్లీన్ & గ్రీన్ లాంటి కార్యక్రమాల ద్వారా హైదరాబాద్ ను ఒక సుందర మెట్రో నగరం గా తీర్చి దిద్దాడు. వైఫల్యాలలోకి వెళితే వ్యవసాయ రంగాన్ని చిన్న చూపు చూడడం, హైదరాబాద్ ను తప్పించి మిగతా నగరాల అభివృద్ధి గురించి పట్టించుకోక పోవడం, రాజకీయం గా తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా అధికారులకు వదలి పెట్టి వారి మీద పూర్తిగా ఆధారపడటం మొదలగునవి.
ముఖ్యమంత్రిగా ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనా రాజకీయ నాయకుడిగా కనిష్ట మార్కులు కూడా ఎందుకు తెచ్చుకోలేక పోతున్నాడో చంద్రబాబు ఆత్మ పరిశీలనా చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.
ఈ మధ్య కాలంలో ఉద్యమ బాట పట్టి నా రెండడుగులు ముందుకు, మూడడుగులు వెనక్కు చందాన చేస్తున్నాడు. పార్టీ కార్యకలాపాల్లో సామాజిక స్పృహ గలిగిన నాయకులు గాని నిబద్ధత తో పనిచేసే కార్యకర్త గాని పాలు పంచు కొనే మార్గం లేకుండా చేసాడు.పార్టీ వ్యవహారాల్లో దళారులదే పెత్తనం . ఉమ్మారెడ్డి, సుజనా చౌదరి లాంటి వాళ్ళ మాటే చెల్లుబాటు అవుతుంది.ఈయన సలహాదారులంటే అతి తక్కువ మేథస్సు,పూర్తి హ్రస్వ దృష్టి గల కడియం, ఎర్రబెల్లి వంటి వాళ్ళే.ఇటువంటి రాజకీయ మరుగుజ్జులే పార్టీ కి దిశా నిర్దేశం చేసేది.
అదే కాంగ్రెస్ పార్టీ ను తీసుకుంటే మన రాష్ట్రము లో పరిస్థితి తెదేపా కన్నా ఇంకా అధ్వాన్నం గా ఉంది. క్రోనీ capitalisam ద్వారా లబ్ది పొంది వేలు, లక్షల కోట్లు గడించిన వాళ్ళు ( kvp,ధర్మాన,కన్నా, జగన్), అమ్మకు అడుగులకు మడుగు లోత్తే వీర విధేయులైన కాకారాయుల్లు(వి హెచ్ ,కే కే ), దళారులు ( TSR, రాయపాటి) తో నిండి ఉంది. కానీ కేంద్రం లో పరిస్థితి దీనికి చాలా భిన్నం గా ఉంది. రాజ్యసభ కు ఎంపిక చేసిన వాళ్ళలో ఆయా రంగాల్లో నిష్ణాతులైన మన్మోహన్ సింగ్ , జై రామ్ రమేష్ లాంటి వాళ్ళు, లోక్ సభ నుంచి మని శంకర్ అయ్యర్ ,కపిల్ సిబాల్ ,చిదంబరం ,కమల్ నాథ్ లాంటి సామాజిక స్పృహ గలిగిన మేధావులు ఉన్నారు .వీళ్ళే పార్టీ విధి విధానాలను రూపొందించి దిశా నిర్దేశం చేయడం లో భాగం పంచు కొంటారు. వివిధ రంగాలకు సంబంధించిన విషయాల్లో మాంటెక్ సింగ్ ఆహుల్వాలియా,రంగరాజన్, స్వామినాధన్ వంటి నిష్ణాతుల సలహాలు తీసుకొంటారు. అందుకే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ కు ప్రత్యామ్నాయం లేకుండా చూసుకో గలుగుతున్నారు.
ఇక తెదేపా ఎగువ సభకు ఎవరిని పంపుతుందో గమనించండి.మైసురారెడ్డి,కంభంపాటి,సుజనా చౌదరి,(ఇదివరలో ఉమ్మారెడ్డి,జయప్రద,రామచంద్రయ్య,)లాంటి వాళ్ళు. వీళ్ళు పార్టీ కు ఏరకంగా దిశానిర్దేసం చేయగలరో చంద్రబాబు కే తెలియాలి.పోలిట్ బ్యూరో అంటే పార్టీ విధివిధానాలను రూపొందించి దిశానిర్దేశం చేసే అతున్నత సమూహం. ఇప్పుడు పోలిట్ బ్యూరో లోని వ్యక్తుల బయోడేటా ను పరిశీలిస్తే, పార్టీ ఇప్పుడున్న అతోగతి కి కారణాలు మీకు అవగత మగుతాయి. మన తెలుగు సమాజం లో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన నిపుణులు,దార్శనికులైన మేధావులు ఎంతోమంది ఉండగా, చంద్రబాబు అభద్రతా భావం మరియు ఆత్మ న్యూనత లతో బాధ పడుతూ ఏరంగంలోను నిష్ణాతులు కాని వాళ్ళు , అల్ప మేథస్సు ,అతి తక్కువ సామర్థ్యం గల దిగువ స్థాయి మనుషులతో పోలిట్ బ్యూరో ను నింపి వేసాడు. ఉమ్మారెడ్డి లాంటి చెరుకు పిప్పి లాంటి నాయకులు ఒక వినూత్న ఆలోచన ఎలా చేయగలుగుతారు ? గతం లో అనుఇంధన ఒప్పందం బిల్లు లోక్ సభ లో ఓటింగ్ కు పెట్టినప్పుడు పోలిట్ బ్యూరో మెంబర్ అయిన మందా జగన్నాధం ఏమి చేసాడో అందరికి తెలిసినదే. 2009 ఎన్నికలకు ముందు ప్రతి విషయం లోను చంద్రబాబు కు సలహాదారులు గా పనిచేసిన కోటగిరి, దేవేంద్ర గౌడ్, సుబ్బారాయుడు, కళా, తమ్మినేని మొదలగు వారంతా చంద్రబాబు ను క్లిష్ట పరిస్థితులలో వదిలేసి ఎలా వెళ్ళిపోయారో అందరికి తెలిసినదే. ఇవన్ని ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే తక్కువ నాణ్యత గల వ్యక్తుల మీద సలహాల కోసం ఆధారపడితే ఏమి జరుగుతుందో చంద్రబాబు కు ఒక సారి అనుభవం లోకి వచ్చిన తర్వాత గూడా తన పంధా మార్చుకొన్న దాఖలాలు లేవని తెలియ జేయడానికే.చంద్రబాబు దృష్టి లో తెలుగు మహిళా అంటే ఒక వోట్ బ్యాంకు, ఒక గ్లామర్ డాల్(జయప్రద, రోజా ). స్వతంత్ర సమరం లో పాల్గొన్న మహిళలు ఎంతో మంది ఈ తెలుగు గడ్డ మీద ఉన్నారు.రాజకీయ చైతన్యం గల మహిళా లెందరో తెదేపా లో కూడా ఉన్నారు.కాని ఈయన ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఒక్క మహిళా కూడా స్టేజీ మీద కనపడదు.చంద్రబాబు తన ఎత్తుగడలతో తీరిక లేకుండా గడుపుతూ ఏసమస్యనైనా పూర్తీ చిత్రం(big picture)చూడలేక పోవడం వలన మంచి వ్యుహకర్త కాలేకపోతున్నాడు అందుకని ఎసమస్యనైన కర్యసీలతతో(proactive) పరిష్కరించకుండా ప్రతిచర్య (reactive) తీసుకొనే రాజకీయనాయకుడు గానే మిగిలి పోతున్నాడు.
ఈ పరిస్థితులలో పార్టీ కు పునర్ వైభవం రావాలంటే ఏమి చేయాలి ? తెలుగు యువత, తెలుగు విద్యార్ధి వంటి సంస్థలను పునరుద్ధరించి/పునర్ వ్యవస్థీకరించి భావి తరానికి స్పూర్తి వంతమైన నాయకత్వాన్ని అందించడానికి గట్టి పునాదులు వేయాలి.మేధావుల, నిపుణుల సామాజిక రాజకీయ చైతన్యం గల దార్శనికుల దగ్గరనుంచి సలహాలు తీసుకొని పార్టీ కు దిశా నిర్దేశం చేసే ప్రక్రియ లో భాగస్వామ్యం కల్పించాలి. కేంద్రం లో సోనియా / కాంగ్రెస్స్ ఒక national advisory council నియమించుకోన్నట్లే తెలుగు జాతి అభ్యుదయానికి ఒక advisory council ను నియమించు కోవాలి. కాంగ్రెస్స్ పార్టీ ను అనుకరించాలా అని మీకు ధర్మ సందేహం రావచ్చు. కాని గతం లో NTR ఏమి చేసారో మీరొకసారి గుర్తుకు తెచ్చుకొంటే మీ సందేహాలు పటాపంచలవుతాయి. నీటి పారుదల రంగానికి sreeraamakrishnayya, వైద్య రంగానికి కాకర్ల సుబ్బారావు,విద్యుత్ రంగానికి నార్ల తాతారావు సలహా దార్లు గా ఉండేవారు.
మెకిన్సీ లాంటి బిజినెస్స్ consultants ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ CEO అనే బిరుదుతో సంబరపడిపోయి ( రాష్ట్రానికి ముఖ్య కార్యదర్శి CEO మరియు ముఖ్య మంత్రి క్రింద పని చేసే ఒక అధికారి మాత్రమె) తన రాజకీయ అజ్ఞానాన్ని ప్రదర్శించిన చంద్రబాబు ఒక రాజకీయ దురంధరుడు (STATESMAN)గా ఎదగాలని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆశిద్దాం.తెలుగు జాతికి ఇప్పుడు ఒక రాజకీయ చైతన్యం, సామాజిక స్పృహ గల రాజకియకోవిధుని(statesman) అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని ఈ తరం నాయకుల్లో ఆ స్థాయికి ఎదగగలిగిన సామర్థ్యం గల ఏకైక నాయకుడు చంద్రబాబు మాత్రమె అనేది నా ప్రఘాడ విశ్వాసం.
ఈ వ్యాసం లో విశదీకరించిన పొరపాట్ల వలెనే చంద్రబాబు సామర్థ్యం ఉన్నా ఆ స్థాయికి ఎదగ లేక పోయాడు అనేది ఒక చారిత్రిక విషాదం.
(ఈ వ్యాసం చలసాని శిశిర్ అనే నా స్నేహితునితో రోజూ మాట్లాడే విషయాల్లోనుంచి సంగ్రహించి/ స్ఫూర్తి పొంది వ్రాసినది )