భారతదేశమంతా సోనియాగాంధీ సొంత సామ్రాజమైనట్లు,అందులో ఆంధ్రప్రదేష్ ఒక సామంత
రాజ్యమైనట్లు వ్యవహరిస్తున్నారని,దేశంలో ఇంగ్లీష్ పాలన పోయి ఇటలీ పాలన
వస్తుందనే భయం వేస్తుంది అని వ్యాఖ్యానించాడు తుడా మాజీ అధ్యక్షుడు
చెవిరెడ్డి భాస్కరరెడ్డి.ఈయన ఏ భాజపా వాడో లేక ఆర్యస్‌యస్ వాడో అని సందేహం
కలగడం సహజం.ఇతగాడు రాశేరె అనుంగు శిష్యుడు.టిటిడి పాలకమండలి సభ్యుడుగా
దేవస్థానం డబ్బు దారిమళ్ళించి తన వూరికి రోడ్డు వేయించుకొని అన్నిరకాల
అవకతవకలకూ పాల్పడ్డ వ్యక్తి.2009 లో ప్రజలు రాశేరె ను ముక్యమంత్రిని
చేయడానికే కాంగ్రెస్ కు వోటు వేసారట.కాంగ్రెస్ పార్టీ,ఆం.ప్ర.రాష్ట్రం
రాశేరె కుటుంబసభ్యుల సొత్తు లా కనపడుతోందీ సత్రకాయలకు.
2004 లో పిసిసి అధ్యక్షుడికే ముఖ్యమంత్రి పదవి అనేసంప్రదాయాన్ని పక్కకు
పెట్టి మరీ రాశేరె ను ముఖ్యమంత్రిని చేస్తే,ఆయన తన అనుచరగణాన్ని అందలం
ఎక్కించి ,రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేయనిచ్చినన్నాళ్ళూ సోనియా ఒక
అమ్మ,ఒక దేవత.2004 లో రాశేరె కు అవకాశమిచ్చిన రీతిలోనే కిరణ్ కుమార్ కు
సియం పదవి కట్టబెట్టగానే ఆమె ఇటలీ వనిత,నియంత గా మారిపోయిందట.ఎంత
హాస్యాస్పదం.పాపం సోనియా చిన్నప్పుడు కొత్త ఆంధ్రవాచకం చదువుకోలేదు.అందుకే
పాముకు పాలు పోసింది,ఫలితం అనుభవిస్తున్నది.చేసుకున్నవాళ్ళకు చేసుకున్నంత
మహదేవా అన్నారు పెద్దలు.(కొ.ఆ.వా.లో కధ మనకందిరికీ తెలిసిందే.రైతుకు తన
చేలో పాముపిల్ల దొరికితే దాన్నింటికి తెచ్చి పాలుపోసి ప్రేమగా
పెంచుతాడు.పాము పెద్దదై రైతును కాటు వేసి చంపుతుంది.నీతి:దుష్టులను
చేరదీయరాదు.)
వైశ్యజాతి కీర్తిని ఎలుగెత్తి చాటండి.టీవీ పెడితే ఈ ప్రకటనల హోరు.టీవీ తెర ఎడమ పైభాగంలో రోశయ్య గారి ఫోటో.హైదెరాబాద్ రోడ్డు మీద కెళితే KASS అనే పేరుతో పెట్టిన పెద్ద హోర్డింగులు.షరా మామూలే,రోశయ్యగారి పెద్ద పెద్ద ఫోటోలేగానీ ఈ సమావేశ నిర్వాహకుల పేర్లుగాని ఫోటోలు గాని లేవు.
కులమతాలకతీతంగా ,రాగద్వేషాలకు తావు లేకుండా,పాలన సాగిస్తానని,రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేసిన పెద్దమనిషి , ఇంతకు ముందే ముఖ్యమంత్రీ ధైర్యం చేయని విధంగా కులసంఘాల కార్యక్రమాలకు హాజరవుతూ ,తన కులపోళ్ళతో సన్మానాలు చేయించుకుంటూ ,తన కులానికే ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ప్రవర్తించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.ఈ నేరానికి రోశయ్య గారిని ప్రాసిక్యూట్ చేయాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేయాలని ప్రజాస్వామ్యవాదులకు నా విజ్ఞప్తి.
నవంబర్ 20 న ది హిందూ లో ఇచ్చిన ప్రకటన "congregation of arya vysyas "లో రోశయ్యగారి పెద్ద ఫోటో లు రెండు,మహాత్మా గాంధీ,పొట్టి శ్రీరాములు ,వాసవీమాత ల చిన్న ఫోటో లతో ప్రచురించారు.భారతదేశంలో దాదాపు అన్ని కులాలకు కులసంఘాలు ఉన్నాయి.అన్ని కులసంఘాలు సమావేశాలు జరుపుకోవడం ,కుల ప్రముఖులను సన్మానించడం అనే ప్రక్రియ తప్పొప్పుల గురించి చర్చించడం ఈ వ్యాసకర్త ఉద్దేశం కాదు.కానీ జాతిపిత మహాత్మాగాంధీని కేవలం ఒక కులనాయకుడీ స్థాయికి దిగజార్చడం ఈ రాజకీయమరుగుజ్జులు చేసిన దుస్సాహసం.ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రోశయ్య ఈ కార్యనిర్వాహకులను వారించకుండా ఈ ప్రక్రియ లో భాగం పంచుకొని తన మరుగుజ్జు స్థాయికి జాతీయనాయకులను కుదించడం క్షంతవ్యం కాని నేరం.
P.S.:-భారతదేశ అతి పెద్ద స్కామువీరుల జాబితా కోసం గూగ్లింగ్ చేస్తే మొదటి పది స్థానాలలో ఏడు స్థానాలనాక్రమించిన పేర్లు దిగువనిస్తున్నాను .
2)హర్షద్ మెహతా(స్టాక్ మార్కెట్ కుంభకోణం),3)కేతన్ ఫరేఖ్ (స్టాక్ మార్కెట్ ),4)C.R. భన్సాలి (కాపిటల్ మార్కెట్),6)దినేష్ దాల్మియా (స్టాక్స్ ),8) వీరేంద్ర రస్తోగీ (బ్యాంకులను మోసం చేయడం),10)ఉదయ్ గోయల్ (చిన్న మదుపుదార్లను ప్లాన్ టేషన్ స్కాం ద్వారా మోసం). వీళ్ళు కాక మన రమేష్ గెల్లి (గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ).వీళ్ళందరినీ సన్మానిస్తే ఇంకా సముచితం గా ఉండేదేమో!
ఆంధేరాప్రదేష్ ముఖ్యమంత్రి రాహురోశయ్యకు,
వేపకాయ వెర్రినాథం వ్రాసుకునే విన్నపం.నేనింతకుముందు తమకు వ్రాసిన"పేరు మార్పు-ప్రగతి పథంలో మన రాష్ట్రం' అనే జాబుకు స్పందించి తమరు మెదక్ జిల్లాకు ఇందిరమ్మ పేరు పెట్టానికి కసరత్తు ప్రారంభించారని తెలుసుకొని కొంత సంతోషించిన మాట వాస్తవమే కానీ మీరింతటితో ఊరుకొంటే ఏమాత్రం ఉపేక్షించేది లేదు.డిశెంబర్ 31 న శ్రీకృష్నకమిటీ నివేదిక వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని వీలైనన్ని ఎక్కువ ముక్కలు చేస్తే ఎక్కువ తెలుగు రాష్ట్రాలకు మన గాంధీ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకొని మన వీరవిధేయత చాటుకొనే మహదవకాశం లభిస్తుంది.
తెలంగాణకు సోనియాలంగాణ అనే పేరు అద్భుతంగా సరి పోతుంది.కోస్తాంధ్రకు కోస్తిందిరాంధ్రని ,రాయలసీమకు రాహులసీమనేది అతికినట్లు సరిపోతుంది కదూ.ఇకపోతే ఉత్తరకోస్తాంధ్రకు కళింగదేశమని నామకరణం చేయమని కొంతమంది అమాయకులు కోరుతున్నారు.కళింగదేశం,ఓఢ్రదేశం ప్రస్తుత ఒడీషా రాష్ట్ర నామాంతరాలు.ఈ రాష్ట్రానికి చెందిన ఒక కులం వాళ్ళను మన రాష్ట్రంలో వడ్డెర లేక వడ్డి అని,మహారాష్ట్రాలో వాఢిరాలని ,ఉత్తరప్రదేష్ లో వాఢ్రాలని పిలవబడతారు.
మన ప్రియతమనేత,త్యాగశీలి,గౌతమబుధ్ధుని తర్వాత రాజ్యాన్ని త్యజించిన నేతగా మన కళాబంధుచే శ్లాఘించబడే అధినేత అల్లుడుంగారైన రాబర్ట్ వాఢ్రా తన పూర్వీకులు ఒడీషా కు చెందినవారని గర్వంగా చాటుకున్న నేపధ్యంలో ఆయన పేరు ఈ ప్రాంతానికి పెట్టడం సముచితంగా ఉంటుందని నేభావిస్తున్నా.ప్రియాంకా పిల్లల పేర్లు తెలియకపోవడం మూలాన,యువనేత ఇంకా బ్రహ్మచారి గానే ఉండిపోవడం మూలాననిన్నూ,భవిష్యత్తులో ప్రియాంకా వాధ్రా పిల్లలలో ఒకరిని ఢిల్లీ పీఠం మీద కూర్చోబెట్టే మహదవకాశం మనకు దక్కవచ్చన్న ఆశతోను,రాబర్ట్ వాఢ్రా పేరు ఈ ప్రాంతానికి పెట్టి మన భావితరాలకు గూడా బంగారు భవిష్యత్తు నివ్వాలనే దురాలోచనతోనూ ఉత్తరకోస్తాంధ్ర పేరు రాబర్ట్ వాఢ్రాంధ్ర గా నామకరణం చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా.తమ అమోఘమైన( చావు)తెలివితేటలతో ,వాఘ్ధాటితో ప్రత్యర్థులమీద ఎదురుదాడి చేసే మీరు తేరగా వచ్చే ఈ మహదవకాశాన్ని ప్రత్యర్థులకందకుండా చేసి మరో జాక్ పాట్ కొట్టాలని కోరుకుంటూ,
భవదీయుడు
వేపకాయ వెర్రినాధం
15 నవంబర్ ఆంధ్రజ్యోతి లో" కులదూషన చేయదగునె కుమతీ సుమతీ"అనే వ్యాసం వ్రాశారు ప్రొ:పులికొండ సుబ్బాచారి(ద్రావిడ విశ్వ విద్యాలయం,కుప్పం).ఈ ద్రావిడ విశ్వవిద్యాలయం లో జరిగే పి.హ్.డి ల భాగోతం గురించి ఇటీవల పత్రికల్లో వార్తలు వచ్చిన సంగతి మనకందరికీ తెలుసు.ఇప్పుడర్థమయింది ఈ విశ్వవిద్యాలయం అంత నొటోరియస్ గా ఎందుకయిందో.
సుమతీ శతకం ,వేమనశతకాలో వివిధ కులవృత్తులవాళ్ళను దూషించారని,సుమతీశతకం లో ఈ దూషనపర్వం మరీ ఎక్కువగాఉందని ఎన్నో ఉదాహరణలతో ఎంతో చక్కగా విశ్లేషించారు.ఈ శతకంలో ఉర్దూ,హిందుస్తానీ పదాలు లేవుగాబట్టి ఇది 14 వ శతాబ్దం కంటే ముందుదనీ,స్త్రీల మీద వ్యతిరేకవ్యాఖ్యానాలు ఉన్నయి కాబట్టి వ్రాసినవారు పురుషుడయిఉంటాడని,అంటరాని కులాలను,వృత్తి కులాలను దూషించాడు కాబట్టి ప్రాబల్యకులానికి చెందినవాడని,వెలమల మీద,బ్రాహ్మణుల మీద వ్యంగ్యాస్త్రాలు సంధించాడు కాబట్టి ఆ రెండు కులాలను మినహాయించాడు.తెలంగాణ లో వాడుకలో ఉన్న అగసాలె(కంసాలి) కులాన్ని రచనలలో విరివిగావాడాడుగాబట్టి రచయిత తెలంగాణ కు చెందినవాడనే నిర్ధారణకు వచ్చాడు.రాజుని దూషించాడు కాబట్టి రాఅయ్యే అవకాశం లేదన్నాడు గాని ప్రాబల్యకులాల్లో దేనికిచెందినవాడో ప్రస్తావించకుండా వదిలేశాడు.సుమతీ శతకకారుడు బద్దెన అనీ బద్దె భూపాలుడనీ సాహిత్యకారులు వ్రాశారంటూనే ఒక్కడు కాదని చెప్పడానికే ఎక్కువ అవకాశం ఉందని తేల్చాడు.
ఈ అమోఘమైన థీసిస్ ను ముగిస్తూ వివిధ వృత్తికులాలను కించపరిచే ఈ శతకాన్ని నిర్విద్దంగా నిషేధించాలని నొక్కి వక్కాణిచాడు.
14 వ శతాబ్దం కంటే ముందు ఆ రోజున్న కాలమానపరిస్తితులకద్దంపడుతూ ,ఒక నిండు జీవిత సారాంశాన్ని కాచివడపోసి,పద్యరూపంలో ,తెలుగువాళ్ళకొక్కరికే సొంతమయి ,వారసత్వంగా వచ్చిన వెలకట్టలేని అమూల్య నిధి నిక్షేపాలు మన శతకాలు.అడిగిన జీతంబియ్యని మిడిమేలపు కొలువుగొల్చి మిడుకుటకంటెన్ వడిగల ఎద్దులగట్టుక మడిదున్నుకు బ్రతికవచ్చని ధైర్యం చెప్పి,సిరిదా వచ్చినవచ్చును సలలితమగు నారికేళ సలలము భంగిన్ సిరిదాపోయినపోవును కరిమింగిన వెలగపండని జీవిత సత్యం తెలిపి ,అల్పుడెపుడుపల్కు ఆడంబరముగాను సజ్జనుండుపలుకు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా అని విశదీకరించి,హీనుడెన్ని విద్యలను నేర్చినగాని ఘనుడు కాదు హీన జనుడుకాని పరిమళమును మోయు గార్దభము గజమగునె అని సూత్రీకరించిన ఆణిముత్యాలనెన్నిటినో పరిగణలోకి తీసుకోని ఈ మహానుభావుడిని పరిమళాన్ని మోసే గార్దభమనాలా లేక ప్రతి ఆంశాన్నీ కులమనే అద్దంలోంచి మాత్రమే చూడగలిగే అంధుడనాలా?
చంద్రబాబు ఒక ఉపమానం గా వాడిన గల్లాపెట్టె అనే మాటను కులానికి అన్వయించి మొత్తం వైశ్యకులాన్నే దూషించినట్లు రంగులద్దిన రోశయ్య,నరకాసురుడు,మహిసాసురుడు నిమ్నకులాలవాళ్ళనీ,దసరా,దీపావళి పండుగలు అగ్ర కులాలవాళ్ళు ,నిమ్నకులాలనవహేళన చేస్తూ జరుపుకొనే పండుగలని కొన్ని కులసంఘాలు చేస్తున్న వాదనులు వింటూ ఉంటే భారతంలో కొజ్జాలను చిన్న చూపు చూసినందుకు భీష్ముణ్ణి నిషేధించాలని కొజ్జాలు,నిమ్నజాతికి చెందిన ఏకలవ్యుడుకి అన్యాయం చేసినందుకు ద్రోణుడ్ని నిషేధించాలని నిమ్నజాతులవాళ్ళు,క్షత్రియులను ఊచకోతకోసినందుకు పరశురాముడుని నిషేధించాలని క్షత్రియులు,సీతనపహరించి లంకలో బంధించినందుకు రావణుణ్ణి నిషేధించాలని మహిళా సంఘాలవాళ్ళు,లాంటి వెర్రి మొర్రి డిమాండ్లు ఎన్ని వస్తాయో అని నాకు చాలా భయం గా ఉంది.
డిసెంబర్ 9 న చిదంబరం చేసిన ప్రకటన ,ఆంధ్రప్రదేష్‌రాజకీయాల్లో పెను మార్పు తెచ్చిన సంఘటన.ప్రకటన వెలువడిన మర్నాడు లగడపాటి రాజీనామా తో మొదలయి ఆంధ్రప్రాంత కాంగ్రెస్ శాసనసభ్యుల రాజీనామాలతో జోరందుకొని అన్ని పార్టీ ల ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి కల్పించాయి.
ప్రణబ్‌ముఖర్జీ కమిటీ కు తాము తెలంగాణా కు అనుకూలం అని లేఖ ఇచ్చిన చంద్రబాబు,రోశయ్య ముఖ్యమంత్రి గా ఆయన అధ్వర్వం లో జరిగిన అన్ని పార్టీల సమావేశం లో కూడా తాము తెలంగాణా కు అనుకూలమని చెప్పారు.అయినా కెసిఆర్,కోదండరాం, తెలంగాణా జాక్‌నుంచి చిన్నా చితకా కాంగ్రెస్ నాయకుల వరకూ చంద్రబాబునూ,తెదేపా ను తెలంగాణా ఏర్పాటుకు ప్రధమ అడ్డంకి అనీ,తెలంగాణా ద్రోహుల పార్టీ అని నిందించడం నాలాంటి ఎందరినో సంభ్రమాఛ్యర్యాలకు గురి చేసింది.రాష్ట్రంలోను, కేంద్రంలోను అధికారంలో ఉన్న పార్టీ రెండు వరుస ఎన్నికల్లో ఓడిపోయి నిరాశా నిస్ప్రుహలతో ఉన్న విపక్షాన్నీ,చేష్టలుడిగి దిక్కుతోచని పరిస్థుతలో ఉన్న ఆ పార్టీ అధినేతను ఆడిపోసుకోవడం,తూలనాడటం ఎంత వరకు సబబు అనే ప్రశ్న ఎంతో మంది మెదళ్ళను తొలుస్తున్న మాట మాత్రం నిజం.
అసలు డిసెంబర్ 9 చిదంబరం ప్రకటనకు తెర వెనక భాగోతం ఏమిటి ?2009 ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి భద్రతాసలహాదారు నారాయణన్‌మావోయిస్టుల విజ్రుంభణ,ముస్లింఫండమెంటలిసంలు తెచ్చే కీడును ధ్రుష్టిలో ఉంచుకొని ,ప్రత్యేక తెలంగాణా కు వ్యతిరేకంగా ఇచ్చిన సలహాను చిదంబరం ఎందుకు పాటించలేదు?2014 లో రాహుల్‌గాంధీ ని ప్రధానమంత్రిని చేయడమనే రంగుల కల అధినాయకురాలి ఏకైక అజెండా కాబట్టి,ప్రత్యేక తెలంగాణా ఇస్తేనే అది నెరవేరుతుందని కెసీఅర్ అనే రాజకీయమాంత్రికుడు క్రిస్టల్ బాల్ లో చూపించడమా?ఆంధ్రప్రదేష్‌సామాజిక రాజకీయ పరిస్థితుల మీద ఏమాత్రం అవగాహన లేని అహమ్మద్‌పటేల్ లాంటి రాజకీయసలహాదారులు ఇచ్చిన ఒకేదెబ్బకు రెండు పిట్టలు(జగన్,చంద్రబాబు)లాంటి అపరిపక్వ సలహా కారణంగానా?తన చిన్నతనంలో ఆనాటి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర వేర్పాటు ఉద్యమం గురించి విన్న బాల చిదంబరం మనసులో ఉన్న వ్యతిరేకభావనల పర్యవసానమా? ఆం. ప్ర.రెండుగాచీల్చి,దానిప్రభావాన్నిగణనీయంగాతగ్గించితమిళనాడుకులభ్దిచేకూర్చాలన్నకుట్రపూరితభావనతోనా?ఏది ఏమైనా కాంగ్రెస్అధిష్టానం ఆంధ్రప్రాంతంలో ప్రజలనుంచి,తమ పార్టీ ప్రజాప్రతినిధులనుంచి ఉవ్వెత్తున ఎగసిన వ్యతిరేక స్పందనను ముందస్తుగా అంచనా వేయలేదనేది వాస్తవం .కాంగ్రెస్‌పార్టీ తన ఘోర తప్పిదాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నమే చంద్రబాబు మీద ఈ బురద జల్లే కార్యక్రమం.
చంద్రబాబును తెలంగాణా ద్రోహిగా చిత్రించడానికి కాంగ్రెస్ పార్టీకున్న రాజకీయ అవసరం మనం గుర్తించాం.మరి కెసిఆర్,కోదండరాం ,ఓయు జాక్ వీళ్ళ మాటేమిటి?రోజూ చంద్రబాబు మీద వీళ్ళు కారాలూ మిరియాలూ నూరాల్సిన అవసరం ఏమిటి?
కాంగ్రెస్ పార్టీ 2014 కంటే ముందే ప్రత్యేకరాష్ట్రం ఇస్తే శాసనసభ్యుల సంఖ్యాపరంగా దానికే మెజారిటీ ఉంటుంది గాబట్టి అదే అధికారపార్టీ అవుతుంది.కాంగ్రెస్‌తర్వాత అత్యధిక శాసనసభ్య్లు మరియు ఓట్ బాంక్ ఉన్న పార్టీ తెదేపా.తెలంగాణా ఏర్పడితే తెదేపా ప్రతిపక్షం లో ఉండి రెండో స్తానం లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు పోటీ రెండో స్థానం కోసమే.కెసిఆర్.కోదండరాం.మొ: వాళ్ళంతాకాంగ్రెస్ పేరోల్ లో ఉండ బట్టీ తెలుగు దేశాన్ని ఎంత బలహీనపరిస్తే అంత లాభం కనుకే తెలంగాణా లో చంద్రబాబు పర్యటనలడ్డుకుంటూ వంతులవారీగా తెదేపా మీద తిట్ట్ల దండకం చదివేది.
ఈ తమాషా చూస్తుంటే చిన్నపుడు చదివిన బ్రాహ్మణుడు-మేక పిల్ల కధ గుర్తొస్తున్నది.బ్రాహ్మణుడు మేక పిల్లతో వెళ్ళ్తుంటే మైలుకొక దొంగ నిల్చొని కుక్కను కట్టేసి తీసుకెల్తున్నావని గేలి చేస్తూ ఉంటారు.చివర్లో బ్రాహ్మనుడు మేకనొదిలేసి వెళ్ళిపోవడం ఆ నలుగురు మేకను కోసుకొని తినడం అందరికీ తెలిసిన కధే.ఇప్పుడు జరుగుతున్న కధలో కూడా కెసిఆర్,కోదండరాం,ఓయు జాక్,కాంగ్రెస్ కలిసి తెలంగాణా అనే మేకను కోసుకొని తినడం ఖాయం.
ప్రతేక తెలంగాణా ఇస్తే ఆంధ్రాలో ఏ పరిణామాలు సంభవిస్తాయో ఊహించడం కష్టమేమీ కాదు.ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం సంభవిస్తుంది. కేంద్రం లో మమతా బెనర్జీ(గూర్ఖాలాండ్) ,శరద్‌పవర్(విధర్భ),కరునానిధి (వన్నియార్ దేశం),తమ తమ రాష్ట్రాల్లో ఉన్న ప్రతేక రాష్ట్రాల కోరికల ద్రుష్ట్యా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించక తప్పదు.అయినా కాంగ్రెస్ పార్టీ మూర్ఘంగా ముందుకెళితే కేంద్ర ప్రభుత్వ పతనం ఖాయం.పైన విశదీకరించిన కారణాలమూలాన కాంగ్ర్స్‌పార్టీ పరిస్థితి ముందు గొయ్యి,వెనుక నుయ్యి.
డిసెంబర్ 9 న చిదంబరం చేసిన అనాలోచిత ప్రకటన పరిణామాలకు బాధ్యత వహించాల్సిన కాంగ్రెస్ పార్టీ తెలుగు దేశం మీదా చంద్రబాబు మీదా చేసే దుష్‌ప్రచారం నపుంసక ఆగ్రహజ్వాల మాత్రమే.సమస్యలను నాన బెట్టడం వాయిదావెయ్యడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య . ఆ ప్రయత్నం లో భాగమే శ్రీక్రుష్న కమిటీ ఏర్పాటు.
వివిధ రంగాల్లోని నిపుణులతో కూర్చిన కమిటీ ఆంధ్రప్రదేష్ అవతరణ తర్వాత ప్రాంతాలవారీగా జరిగిన అభివ్రుధ్ధి,ఆదాయ వ్యయాల నిగ్గు తేలుస్తుంది కాబట్టి వేర్పాటువాదుల అభద్ద ప్రచారాలకు ఇకనైనా తెరపడుతుందని ఆశిద్దాం.
తెలంగాణా ప్రజలు ఇకనైనా నిజమైన దోషులను గుర్తించి (కాంగ్రెస్,టిఆర్యస్,కోదండరాం తదితరుల) మాయగాళ్ళ ఉచ్చు లో పడకుండా హైదరాబాద్ పునర్‌వైభవానికి, తద్వారా ఆంధ్రప్రదేష్ అభివ్రుధ్ధిలో భాగస్వామ్యులౌతారని ఆసిస్తూ.(నా స్నేహితుడు చలసాని శిశిర్ సలహాలు తీసుకొని వ్రాసిన వ్యాసం)
చంద్రబాబు ఈ మధ్య పాల్గొన్న సమావేశాల్లో తరచుగా అంటున్నది ఆలీబాబా పోయాడు , 40 మంది దొంగలు రాష్ట్రాన్ని దోచుకొంటున్నారని . ఈ అభియోగానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల్నించి ఏమీ ప్రతిక్రియవ్యక్తం కాకపోవవడం తో మనం చిన్నప్పుడు చదువుకున్న ఆలీబాబా40దొంగల కధ చాలామందికి తెలియకపోవడమో లేక వాళ్ళ స్మ్రుతి పధం లోంచి చెరిగిపోయిందనోభావిస్తూ ఈ కధ క్లుప్తం గా క్రింద వ్రాస్తున్నాను.
ఆలీబాబా అనే నిరుపేద కట్టెలకోసం తన గాడిదతో అడవికి వెళ్ళడం,ఒక దొంగలముఠా తమ నిధిని దాచుకొన్న గుహను చూడటం,వాళ్ళ రహస్య కోడ్ వినడం వాళ్ళు వెళ్ళిపోయినతరువాత ఆ గుహలోనుంచి కొంత బంగారం సంగ్రహించి గాడిద మీద ఇంటికి తెచ్చుకోవడం జరుగుతుంది.ఈ విషయం తెలుసుకొన్న ఆలీబాబా అన్న దురాశతో ఆ గుహలో దూరి రహశ్య కోడ్ మరిచిపోయి దొంగల చేతికి చిక్కి హతమవడం ,ఆలీబాబా ఆ శవాన్ని ఒక దర్జీ సాయంతో దహన సంస్కారాలు నిర్వర్తించడం ,అదే దర్జీ సాయంతో దొంగలు ఆలీబాబా ఇల్లు గుర్తించి మారు వేషంలో 38 నూనె పీపా లతో (ఇద్దరు దొంగలను నాయకుడే చంపుతాడు) ఆలీబాబా ఇంటిలో ఆశ్రయం పొందటం , మోర్జినియా(ఆలీ బాబా ఇంట్లో పనిమనిషి) సమయస్పూర్తితో కాగే నూనె పోసి నాయకుడు మినహా అందరినీ హతమార్చడం . నాయకుడు పారిపోయి మళ్ళా ప్రతీకారేఛ్ఛతో కోర్గియా అనే మారు పేరుతో ఆలీబాబా ఇంట్లో ప్రవేసించడం , న్రుత్య ప్రదర్శన లో భాగంగా చురకత్తితో పొడిచి మోర్జినియా దొంగలముఠా నాయకుడిని హతమార్చడం , ఆలీబాబా మోర్జినియాను తన కోడలిగా చేసుకోవడంతో కధ సుఖాంతమవుతుంది.
చంద్రబాబు రాశేరె గురించి మాట్లాడుతూ ఆలీబాబా పోయాడు ,40 మంది దొంగలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని అనడం ఆయన అజ్ఞానానిబయటపెట్టుకున్నట్లు గా నాకనిపిస్తోంది . పైకధలో ఆలీబాబా హీరో ,దొంగల నాయకుడు విలన్. చంద్రబాబు ఇదే పేరుతో ఉన్న రామారావు గారి సినిమా చూస్తే కనీసం కధన్నా తెలిశేది .ఈ విధంగా మాట్లాడి చంద్రబాబు తన అజ్ఞానాన్ని వెల్లడి చేయరని ఆశిస్తూ .
structural engineer engaged in infrastructure projects.emotional,anti congress ; averse to political leaders engaged in outrageous loot of public money.